ప్రభుత్వ ఏర్పాటుకు పళనిసామిని ఆహ్వానించండి: టీటీవీ దినకరన్

  • అసెంబ్లీ ఎన్నికల్లో ఒక స్థానం గెలిచిన ఏఎంఎంకే పార్టీ
  • గవర్నర్‌ను కలిసిన ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి
  • తన ఎమ్మెల్యేతో పాటు తాను సంతకం చేసిన లేఖను అందజేసిన దినకరన్
తమిళనాడులో మరో ఆసక్తికర పరిమాణం చోటు చేసుకుంది. ఇప్పటికే విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై సస్పెన్స్ కొనసాగుతోంది. తాజాగా, అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) పార్టీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ గవర్నర్‌ను కలిసి కొత్త ట్విస్ట్ ఇచ్చారు. అన్నాడీఎంకే అధినేత పళనిసామిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా తాను, తన పార్టీ ఎమ్మెల్యే సంతకం చేసిన లేఖను గవర్నర్‌కు అందించినట్లు చెప్పారు.

గవర్నర్‌ను కలిసిన అనంతరం దినకరన్ మీడియాతో మాట్లాడుతూ, తాము పళనిసామికి మద్దతు పలుకుతున్నామని చెప్పారు. మన్నార్‌గుడి నుంచి గెలిచిన తమ పార్టీ ఎమ్మెల్యే ఎస్.కామరాజ్ కూడా అన్నాడీఎంకేకు మద్దతుగా ఉన్నారని చెప్పారు. కాబట్టి పళనిసామిని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని దినకరన్ కోరారు. ఆయనకు మెజారిటీ ఉందని తెలిపారు.

సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోన్న తమిళనాడు రాజకీయం

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం, ప్రభుత్వ ఏర్పాటు అంశం సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. నాలుగు రోజులుగా విజయ్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. కాంగ్రెస్ మొదటి రోజున, వామపక్షాలు ఈరోజు మద్దతు పలికాయి. అయినప్పటికీ విజయ్‌కి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఎమ్మెల్యేల బలం లేదు. వీసీకే, ఐయూఎంఎల్ మద్దతు ఇస్తే విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. కానీ చివరి నిమిషంలో ఆ పార్టీలు హ్యాండిచ్చాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ రెండు చోట్ల పోటీ చేసి గెలిచారు. ఆయన తిరుచ్చి (తూర్పు) సీటును వదులుకోనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి తనకు టిక్కెట్ ఇవ్వాలని, ఉపముఖ్యమంత్రి పదవి కావాలని వీసీకే పార్టీ అధినేత తిరుమావళవన్ డిమాండ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ కారణంగానే ఆ పార్టీ గవర్నర్‌కు మద్దతు లేఖ ఇవ్వలేదని కథనాలు వచ్చాయి. మరోవైపు తాము ఎవరికి మద్దతు ప్రకటిస్తూ లేఖ ఇవ్వలేదని ఐయూఎంఎల్ తెలిపింది. తాము డీఎంకేతోనే ఉంటామని స్పష్టం చేసింది.

TTV Dinakaran
Tamil Nadu politics
Palaniswami
AMMK
Tamil Nadu government formation
Tamil Nadu assembly elections

More Telugu News